- మూసీ నదికి ఇరువైపులా ‘నైట్ ఎకానమీ’ డెవలప్‌మెంట్
- చెరువుల దగ్గర మహిళల భద్రత కోసం ‘లేక్ పోలీసింగ్ వ్యవస్థ’
- మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోయే పేదలను రోడ్డున పడేయం
- ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుమృక్ ఉద్దౌలా లేక్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో ఇకపై రాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు కొనసాగించుకునేలా అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో మూసీ నదిని సైతం 55 కిలోమీటర్ల మేర (గండిపేట నుంచి గౌరెల్లి వరకు) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, నదికి ఇరువైపులా రాత్రి పూట వ్యాపారాలు కొనసాగేలా ‘నైట్ ఎకానమీ’ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, చిన్న వ్యాపారుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ శివరాంపల్లిలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమృక్ ఉద్దౌలా లేక్‌ను సీఎం ప్రారంభించారు.
99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హైదరాబాద్ నగరాభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. మొన్న రాజేంద్రనగర్‌లోని హిమాయత్ సాగర్ ఎకో పార్కును ప్రారంభించామని, ఇప్పుడు బుమృక్ ఉద్దౌలా చెరువును స్థానిక ప్రజలకు కానుకగా ఇచ్చామని చెప్పారు. మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయబోమని, వారికి అక్కడే ప్రభుత్వ ఖర్చుతో ఇండ్లు నిర్మించి ఇస్తామని, అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ..
ఒకప్పుడు నిజాం నవాబులు అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను నిర్మించారని, ఆనాడు ‘లేక్స్ అండ్ రాక్స్ సిటీ’గా పేరొందిన హైదరాబాద్ నేడు చెత్తాచెదారంతో కలుషితమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగర ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు వందేండ్ల క్రితమే మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్లతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి అద్భుతాలను నిజాం సర్కార్ నిర్మించిందని గుర్తుచేశారు.
లండన్, సౌత్ కొరియా, అమెరికా, సింగపూర్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నదీ తీరాల్లోనే అద్భుతమైన నగరాలు వెలిశాయన్నారు. అదే తరహాలో హైదరాబాద్ పాతబస్తీని కూడా కేవలం ‘ఓల్డ్ సిటీ’గా కాకుండా, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే అందమైన ‘ఒరిజినల్ సిటీ’గా తీర్చిదిద్దే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకున్నదని తెలిపారు. పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణకు, రహదారుల వెడల్పు పనులకు, ఉస్మానియా దవాఖాన ఆధునీకరణకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిపారు.
కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు, పార్కులను పునరుద్ధరించి పాతబస్తీతో సహా నగరవ్యాప్తంగా అద్భుతమైన పర్యాటక కేంద్రాలను (లేక్ ఎకానమీ) అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అంబర్‌పేటలోని పురాతన బతుకమ్మ కుంటను కబ్జాదారుల నుంచి విడిపించి, నేడు ఆడబిడ్డలు సంతోషంగా పండుగలు చేసుకునేలా ఎలాగైతే తీర్చిదిద్దామో, బుమృక్ ఉద్దౌలా లేక్‌ను కూడా అలాగే అభివృద్ధి చేశామన్నారు. ఇక్కడ నిత్యం కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు వాకింగ్ చేసుకునేలా సౌకర్యాలు కల్పించామన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ‘లేక్ పోలీసింగ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని పోలీసులు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
